Tuesday, June 15, 2021

DACTA-AP Excitement over English medium in degree colleges

                                             డిగ్రీ కళాశాలల్లో ఇంగ్లీష్ మీడియం పై ఏపీ డాక్టా హర్షం





2021-2022 విద్యా సంవత్సరం నుండి డిగ్రీ కళాశాలల్లోని కోర్సులను ఇంగ్లీష్ మీడియం లోనే నిర్వహించాలనే ఏపీ  ముఖ్యమంత్రి వైయస్ జగన్ సూచన మేరకు ఉన్నత విద్యామండలి తీసుకున్న నిర్ణయం పట్ల దళిత కాలేజీ టీచర్స్అసోసియేషన్(డాక్టా- ఏపీ) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోవిందు సురేంద్ర, కార్యవర్గ సభ్యులు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు,

     ఈసందర్భంగా  రాష్ట్ర అధ్యక్షులు  మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలలో ప్రధాన పాత్ర ఇంగ్లీష్ మీడియమే నని అన్నారు. చిన్నప్పటినుండి తెలుగు మీడియంలోనే చదువుకున్న వారు ఉన్నత చదువులు ముగించుకుని ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నించే సందర్భంలో ఇంగ్లీషు భాషలో ఎంతోమంది భావవ్యక్తీకరణ చేయలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇటువంటి సందర్భంలో మూడేళ్ల డిగ్రీ కోర్సును నాలుగేళ్లు హానర్స్ కోర్సుగా చేయడం, ఇంగ్లీష్ మీడియంలోనే తప్పనిసరిగా చదవడం ద్వారా విద్యార్థులు ఇంగ్లీషులో పట్టు సాధిస్తారన్నారు,

      సంక్షేమ పథకాల విషయంలోనే కాదు, విద్యా సంస్కరణలలో కూడా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు దేశంలోని అనేక రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలిచాయని డాక్టా చైర్మన్ డాక్టర్ తలతోటి పృథ్విరాజ్ అన్నారు.  ఏ ప్రభుత్వమైతే విద్యా వైద్య రంగాల అభివృద్ధి పై దృష్టి పెడుతుందో అక్కడి ప్రజలలో విద్యా సామాజిక అంశాలలో విప్లవాత్మక ప్రగతిని సాధించవచ్చని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం నాడు- నేడు, విద్యా దీవెన, విద్య వసతి వంటి పలు విద్యా పథకాలను పదుల కొద్దీ నూతన మెడికల్ కళాశాలల స్థాపన చేయడం ఇవన్నీ రాష్ట్రంలోని విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు దోహదపడతాయని డాక్టా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాకాని సుధాకర్ తెలిపారు.

DACTA-A.P. Representation to Sri Satish Chandra on Merge



 ప్రియమైన డాక్టా మిత్రులందరికీ జై భీమ్ లు 🙏

ఈరోజు(15/6/2021) మధ్యాహ్నం 2గంటలకు  special principal secretary higher education గౌరవ సతీష్ చంద్ర   IAS గారిని సెక్రటేరియట్ లోని వారి ఛాంబర్ లో కలిసి మన అసోసియేషన్ ఫైనాన్స్ సెక్రటరీ డా కొల్లేటి రమేష్, EC మెంబర్ డా భాను నాయక్, నేను మాట్లాడాము. సార్ మన అసోసియేషన్ యెడల చాలా సానుకూలంగా ఉన్నారు. చాలా సమయం ఇచ్చి మనతో మాట్లాడారు. మనం ఇచ్చిన మెమోరాండం స్వీకరించి విలీనానికి అనుకూలంగా ఉన్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. విలీన ప్రక్రియ జరుగుతుంది అని చెప్పారు. విలీన సమయంలో ఎయిడెడ్ సిబ్బంది కి ఎటువంటి  సమస్యలు లేకుండా కావాల్సిన సర్వీస్  అంశాలను పరిగణలోకి తీసుకోవాలని  మెమోరాండం లో అన్ని అంశాలు  రాశామని వివరించాము. అన్ని విషయాలను సావదానంగా విని,ఎవరికీ ఇబ్బంది లేకుండా అందరికీ న్యాయం జరిగేలా చూస్తామన్నారు. మన అసోసియేషన్ కి సమయం ఇవ్వటమే కాకుండా సానుకూలంగా స్పందించిన సతీష్ చంద్ర సార్ కు మన డాక్టా తరుపున హృదయ పూర్వక అభినందనలు, శుభాకాంక్షలు 🌹తెలియచేస్తున్నాము. మిత్రులందరూ ఈ విషయాలన్నీ గమనించగలరు. అందరికీ జై భీమ్ లతో... డా కాకాని సుధాకర్ ప్రధాన కార్యదర్శి DACTA (డాక్టా ). 🙏

Thursday, June 3, 2021

INVITATION FOR AIDED TEACHERS' ASSOCIATIONS THROUGH GOOGLE MEET ON 4TH JUNE 2021

 


ఎయిడెడ్ వ్యవస్థలో పని చేస్తున్న ఉద్యోగుల్ని ప్రభుత్వ స్కూల్స్, కాలేజీలలో విలీనం చేసే ఆలోచనతో ప్రభుత్వం వడివడిగా వేస్తున్న అడుగులను అందరూ గమనిస్తూనే ఉన్నారు. కొందరు తప్ప దాదాపు అన్ని అసోసియేషన్లు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ మద్దతిచ్చే అసోసియేషన్లు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి విలీన ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం రూపొందించే గైడ్లైన్స్- విధివిధానాలలో మనకు అన్యాయం జరగకుండా ఉండేందుకు, ఈ ప్రక్రియ వేగవంతంగా అమలు అయ్యేందుకు డాక్టా-ఎ.పి. అసోసియేషన్ , ఆంధ్ర ప్రదేశ్ జూనియర్ కళాశాల ఎంప్లాయిస్ అసోసియేషన్,  ఆంధ్ర ప్రదేశ్ టీచర్స్ గిల్డ్ ప్రధాన కార్యవర్గ సభ్యులు చర్చించుకొని ఒక ఏకాభిప్రాయానికి వచ్చి ప్రభుత్వ అధికారులకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే విషయమై చర్చించేందుకు రేపు అనగా 4/6/2021 సాయంత్రం 4 గంటలకు గూగుల్ ద్వారా సమావేశం జరుగుతుంది. డాక్టా అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు సమయాన్ని పాటిస్తూ హాజరుకావాలని కోరుతూ ఆహ్వానిస్తున్నాము.~ డాక్టా - ఎ.పి.

Monday, March 1, 2021

ఎయిడెడ్ కాలేజీలను ప్రభుత్వ కాలేజీలుగా మార్చాలి !









    12/ 2 /2021న ఏ.పి.  సీ.ఎం. తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ఉన్నత విద్యా శాఖ సమీక్షలో శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజాసంఘంగా, రిజర్వేషన్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ గా నేను హర్షిస్తూ స్వాగతిస్తున్నాను.

   ప్రస్తుత ఎయిడెడ్ కళాశాల తీరు తెన్నులను పరిశీలిస్తే గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు లేదా పూర్తి స్థాయి ప్రైవేటు డిగ్రీ కాలేజీలుగా అంటే  రెండే రెండు యాజమాన్యాలు  ఉండాలనే జగన్ గారి నిర్ణయం సరియైనది చెప్పొచ్చు. మావంటి ప్రజాసంఘాలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము. నా వివరణను పూర్తిగా విని స్పందించాలని ఆశిస్తున్నాను.

 

    రాష్ట్రంలో 2,203 ఎయిడెడ్ పాఠశాలల్లో 7,298 మంది సిబ్బంది ఉన్నారు. 182 ఎయిడెడ్ జూనియర్ కాలేజీలల్లో 721 సిబ్బంది ఉన్నారు. 116 ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలల్లో 1347 సిబ్బంది పనిచేస్తున్నారు.

 ఎయిడెడ్ విద్యా వ్యవస్థ విధానానికి స్వస్తి పలికే విషయంలో ప్రధానంగా ఎయిడెడ్ కళాశాలల విషయంలో మాలాంటివారు ప్రభుత్వానికి గొంతుకలపడంలో ఎన్నో కారణాలు ఉన్నాయి. ఈ విషయాలపై బహిరంగంగా చర్చించడానికి మేము సిద్ధమే! ముందుగా... 

ఎయిడెడ్ వ్యవస్థ గూర్చి ఒక్కముక్కలో చెప్పమంటే....

~ నిధులు, జీతభత్యాలు ప్రభుత్వానివి!.  పెత్తనం మేనేజ్మెంట్ లది!

~ ఎయిడెడ్ కాలేజీ మేనేజ్మెంట్ లకు విద్యా చట్టాలు చిత్తు కాగితాలతో సమానం!

~ పోస్టులు అమ్ముకుని మేనేజ్మెంట్ లు డబ్బులు గడించే వ్యవస్థగా ఎయిడెడ్ వ్యవస్థ పేరు సంపాదించింది.

~ మ్యాచింగ్ గ్రాంట్ కాగితం మీదే...! మంజూరైన నిధుల్లో సగం డబ్బులు యాజమాన్యాల జేబుల్లోకే!

~ అక్రమాల పుట్ట ఎయిడెడ్ వ్యవస్థ.  

ఇక ఈ ఎయిడెడ్ వ్యవస్థలోని లోటుపాట్ల చర్చకు వద్దాం!

[ఆ] ఎయిడెడ్ వ్యవస్థ లోని లోటుపాట్లు:

  (1) సీనియారిటీకీ, సిన్సియారిటికీ గుర్తింపే ఉండదు: 

   ఎయిడెడ్ కళాశాలల్లో ఎంతమంది సీనియారిటీ, అర్హతలను బట్టి ప్రిన్సిపాల్ గా నియమించబడ్డారు?. ఎన్ని ఎయిడెడ్ కళాశాల యాజమాన్యాలు ఈ నిబంధనను గౌరవించి అనుసరించాయి? ప్రిన్సిపాల్ నియామకాల్లో అన్యాయం జరిగినవారికి ఏ అధ్యాపక సంఘాలు పోరాడి న్యాయం చేశాయి?    ప్రిన్సిపాల్ నియామకాల్లో కమీషనర్, ఆర్జేడీలు పరిష్కరించినవి ఎన్ని ఉన్నాయి?…ఒకళ్లో అరో ఎక్కడైనా విధిలేని పరిస్థితుల్లో ప్రిన్సిపాల్ షిప్ దళిత అధ్యాపకులకు ఇస్తే ఏళ్ళతరబడి వారిని ఎఫ్.ఎ.సి. క్రిందే ఉంచుతున్నాయి యాజమాన్యాలు. కారణం దళితులనే చిన్న చూపు.... వివక్షే!  ఇటువంటి మేనేజ్మెంట్ లపై చర్యలు తీసుకోవాల్సిన కమీషనర్, ఆర్జేడీ స్థాయి వంటి అధికారులు వారి అక్రమాలలో భాగస్వాములవుతున్నారు.

  (2) నియామకాలు:

ప్రభుత్వోద్యోగులే జవాబుదారితనంకై బాధ్యతలు నిర్వర్తించాల్సిన హాస్టల్ వార్డెన్, ఎన్.సి.సి. , ఎన్.ఎస్.ఎస్., ఇటువంటి వాటిల్లో పార్ట్ టైం అధ్యాపకులను ... తమ సామాజిక వర్గానికి చెందిన పార్ట్ టైం అధ్యాపకులను యాజమాన్యాలు నియమిస్తున్నాయి. కారణం...కేవలం కులవివక్ష. బ్యాక్ లాగ్ పోస్టుల ద్వారా నియమింపబడిన అధ్యాపకులకు ఆ అవకాశాలు, గౌరవం దక్కకూడదనే చేస్తున్నాయి. దళిత అధ్యాపకులపై కళాశాల యాజమాన్యాల సామాజిక వర్గానికి చెందిన పార్ట్ టైం అధ్యాపకులు పెత్తనం చెలాయిస్తారంటే ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు.

(3) రిజర్వేషన్ విధానాలకు ఆమడదూరం: రిజర్వేషన్ విధానాల్ని తుంగలో తొక్కి ఏళ్ళతరబడి ఉద్యోగ నియామకాలు జరిగిన /జరిపిన ఈ ఎయిడెడ్ వ్యవస్థలో 1998 ప్రాంతం నుండి ప్రభుత్వం ఎంతో ఒత్తిడి చేయగా రాష్ట్ర వ్యాప్తంగా విధిలేని పరిస్థితుల్లో ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ జరిగింది. ఈ నాటికీ ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీపై నిషేధం లేకపోయినా, రాష్ట్రంలోని అన్ని ఎయిడెడ్ కళాశాలల్లో భర్తీ చేయాల్సిన పోస్టులు వందల్లో ఉన్నా అందుకు ఎయిడెడ్ కళాశాల యాజమాన్యాలు సిద్ధంగా లేరు. పార్ట్ టైం అధ్యాపకులను నియమించుకుని జీతాలు ఇచ్చుకోవడానికైనా సిద్ధమేగాని; ప్రభుత్వమే జీతం ఇచ్చే బ్యాక్ లాగ్ పోస్టులను ఫిల్ చేయ్యడం యాజమాన్యాలకు ఇష్టముండదు! ఎందుకంటే ఇప్పుడున్న దళిత అధ్యాపకులే యాజమాన్యానికి కంటగింపుగా ఉన్నారు. వీరికితోడు కొత్తవారొస్తే ఇంకేముంది అనేది వీరి దుర్మార్గపు ఆలోచన!

(4) అవకతవకలు:

ముందే చెప్పాను. ఎయిడెడ్ వ్యవస్థ అంటేనే అవకతవకల పుట్ట. పోస్టుల భర్తీ మొదలుకొని వివిధ స్కీం ల క్రింద మంజూరు అయ్యే నిధుల్లో, విద్యార్థుల స్కాలర్షిప్ లలో ఎన్నో అవకతవకలు. కొన్ని కళాశాలల్లో స్థలాలు కూడా అమ్ముకున్నారు. మార్ట్ గేజ్ లో రుణాలు పొందారు. ప్రభుత్వ భవనాలను ప్రైవేటు వ్యక్తులకు బదలాంచారు. అధికారులకు తెలియజేసినా లంచాలకు మరిగి ఎయిడెడ్ యాజమాన్యంతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని మోగించారు.

(5) విద్యా చట్టాలకు తూట్లు:

ఎయిడెడ్ యాజమాన్యాల చర్యలన్నీ చట్టవిరుద్ధమే. నెలల తరబడి ఉద్యోగులసస్పెన్షన్లు మొదలుకుని... సరెండర్ లు, వివిధ రకాల వేధింపులు. బాధిత ఉద్యోగులకు న్యాయం చేయకపోగా యాజమాన్యాలతో చేతులు కలిపే కమీషనర్, ఆర్జేడీలు. 

(6) ధనార్జనే ప్రధానంగా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు లు:

 ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా విద్యార్థులనుండి అధిక ఫీజులు వసూలు చేయడం. వివిధ రకాల ఫైన్ల పేరుతో విద్యార్థుల ను ఆర్థికంగా దోచుకోవడం! ఎయిడెడ్ కోర్సులను ప్రక్కన బెట్టి ధనార్జనే ప్రధానంగా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను పెట్టడం, నిబంధనలకు విరుద్ధంగా ఆ అన్ ఎయిడెడ్ సెక్షన్లకు ఎయిడెడ్ స్టాఫ్ ను పంపించడంవంటివి ఎన్నో చేస్తున్నారు.

(7) వివక్ష:

మరిముఖ్యంగా దళిత అధ్యాపకులే ఎక్కువగా ఉన్న ఈ పరిస్థితుల్లో ఉన్నత ఉద్యోగ అవకాశాలు వచ్చినా పంపకపోవడం, ఎఫ్.డి.పి. ద్వారా డాక్టరేట్ చేసే అవకాశం దళిత అధ్యాపకులకు ఇవ్వకపోవడం వంటివి ఎన్నో సమస్యలు ఉన్నాయి.

(8) ఆత్మ గౌరవానికి స్థానములేని చోటు:

 ఉన్నత చదువులతో, ఉన్నత స్థాయి ఉద్యోగ హోదాతో, మంచి జీతభత్యాలతో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించే దళిత అధ్యాపకులపట్ల అనేక కళాశాల యాజమాన్యాలు వివక్షకు పాల్పడుతున్నాయనడంలో సందేహమే అక్కర్లేదు. ఆత్మ గౌరవానికి స్థానములేని చోటు ఎయిడెడ్ కళాశాలలు 

(9) తూతూమంత్రంగా ఆడిటింగ్:

ఎయిడెడ్ కళాశాలల్లో జరిగే ఆర్థికపరమైన అవకతవకలను గుర్తించి నియంత్రించడంలో కీలకంగా వ్యవహరించాల్సిన ఆడిటింగ్ ప్రక్రియకూడా ప్రతీ ఏటా ఆడిటింగ్ విధిగా జరగకపోగా, మేనేజ్మెంట్ లచే మేనేజ్ చేయబడుతుంది అనడంలో ఆశ్చర్యం లేదు! అక్రమాలన్నీ సక్రమాలుగా కాగితాలపై మారిపోతాయన్నది పచ్చి నిజం!.

(10) బంగారు బాతు ఎయిడెడ్ వ్యస్థ : 

నిజమే ! ఎయిడెడ్ వ్యవస్థ బంగారు  బాతులాంటిది ఆర్జేడీ , కమీషనరేట్ ఆఫీసుల్లో పనిచేసే యావత్తు సిబ్బందికి . కత్తికి రెండువైపులా  అన్నట్టు రెండు చేతులా ...రెండు  వైపులా డబ్బే ! అక్రమాలు చేసే మేనేజ్మెంట్లనుండి  ముడతాయి, వారి బాధితులనుంచి ముడతాయి.   లంచాలు ఇచ్చి  పనులు చేయించుకునే సంఘాలనుండి, అధ్యాపకులనుండి డబ్బే  . ఎయిడెడ్ వ్యవస్థను లంచాల వటవృక్షంలా పెంచిపోషించింది ఈ ఉద్యోగులే! . మాకు లంచాల సంగతి తెలియదని వాళ్ళ పిల్లా పాపలమీద ప్రమాణం చేసే  ఉద్యోగులెందరుంటారు ? ఎయిడెడ్ కళాశాల యాజమాన్యాలకు వీరు వేగుల్లా పనిచేస్తారు . మేనేజ్మెంట్ పై ఏ అధ్యాపకుడైన అధికారుల వద్దకు సమస్యను తీసుకొస్తే వెంటనే సమాచారం మేనేజ్మెంట్ కు చేరిపోతుంది. అంతేకాదు మేనేజ్మెంట్ కు ఆఫీసు వారికి మధ్య అక్రమాలు సక్రమాలు చేయించే బ్రోకర్ లు కూడా ఉన్నారు 

 (11) పార్ట్ టైం పెత్తనం దారులు:

  కొన్ని కళాశాలల్లో ‌ పార్ట్ టైం అధ్యాపకులు శాఖాధికారులుగా ఉంటే ఎయిడెడ్ అధ్యాపకులు వారి క్రిందపనిచేయాల్సిన పరిస్థితులు మరికొన్ని కాలేజీల్లో! ఒకో ఎయిడెడ్ కాలేజీ ఒకో రకమైన సమస్య. అధికారుల నిర్లిప్తతే యాజమాన్యాల బలంగా సాగుతోంది!

(12) మేనేజ్మెంట్ అండదండలు:

 కొన్ని కాలేజీల్లో మేనేజ్మెంట్ అండదండలతో ఇష్టం వచ్చినప్పుడు వచ్చివెళ్ళే ఉద్యోగులు. మేనేజ్మెంట్ పెద్దలను ప్రసన్నం చేసుకుని వ్యాపారాలు చేసుకునే ఉద్యోగులు ఎందరో! క్లాసులు ఎగ్గొట్టే అధ్యాపకులూ లేకపోలేదు!

(13) పని ఒకరు - జీతం వేరొకరికి :

ఇంకొన్ని కళాశాలల్లో నాన్ టీచింగ్ ఉద్యోగుల్లో ఉద్యోగం ఒకరిది, ఆ ఉద్యోగి విధులను నిర్వర్తించేది వేరొకరు. అవకతవకలు ఒకటీ అరకాదు!

(14) కమీషన్ల పర్వం:

చాలా కాలేజీల్లో ఉద్యోగులకు వచ్చే ఎరియర్స్ లో పర్సంటేజ్ లు సమర్పించుకుంటేనే ఫైల్స్ కదులుతాయి. పెన్షన్ పేపర్లు కదలాలంటే మేనేజ్మెంట్ అడిగే లకారం ఇవ్వాల్సిందే. సస్పెన్షన్ రేవోక్ చెయ్యాలంటే మేనేజ్మెంట్ ఇచ్చే బ్యాంక్  అకౌంట్ లో డబ్బులు వెయ్యాల్సిందే ! రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా పెన్షనర్స్ ను కూడా ఎరియర్స్ సమయంలో దోచుకునే యాజమాన్యాలు ఎన్నో ఉన్నాయి.

(15) అయినోళ్లకు ఆకుల్లో కానోళ్ళకు కంచాల్లో...:

కొన్ని మేనేజ్మెంట్లు స్టాఫ్ మీటింగ్స్ లో బహిరంగంగానే తమకు ఇష్టం ఉన్నవారికే ఏ లీవులైనా ఇచ్చి సర్దుబాటు చేసుకుంటామని చెబుతున్నారంటే  అధికారులు లంచాల మత్తులో నిద్రపోతున్నారన్నది స్పష్టమౌతుంది. 

 (16) బాధాకర విషయం:

     చట్టవిరుద్ధమైన కళాశాల యాజమాన్యాలను నియంత్రించాల్సిన ఉన్నత విద్యాశాఖ ఉద్యోగులు-అధికారులు యాజమాన్యాతో ములాఖాత్ అయి ప్రభుత్వానికి, ఎయిడెడ్ ఉద్యోగులకు ద్రోహం చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించకపోగా మీరు కూడా కోర్టులకు వెళ్ళండి అని ఉచిత సలహాలు ఇస్తున్నారు. దీనికి సాక్ష్యం ఇప్పుడు హైకోర్లులో ఉన్న ఎయిడెడ్ అధ్యాపకులు వేసిన పిటీషన్లే సాక్ష్యం. యాజమాన్యాలతో కలిసి వీరు చేసిన తప్పిదాలకు కోర్లుల్లో ప్రభుత్వ వాదనలు నిలవక ఓడిపోయినా ఏమాత్రం కమీషనర్, ఆర్జేడీలకు అవమానంగా ఫీలవరు . ప్రభుత్వానికి చెడ్డపేరనే తలంపు వారికీ లేకపోగా కోర్టు తీర్పును అమలు చేయించే విషయంలోకూడా అలసత్వమే ! కనుకనే ఈ మధ్య కమీషనర్ ,ఆర్జేడీల వంటి  ఉన్నతాధికారులపై ఇటీవల హైకోర్టు అరెస్ట్ వారెంట్ జారీచేయించింది

    21/11/2019 న విద్యా రంగానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న కోర్టుకేసులను  గూర్చి గౌరవ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు . ఇటువంటి సమీక్షలు ఎన్ని పెట్టిన అధికారుల వైఖరిలో మార్పులేనప్పుడు వ్యర్థమే .

(17) కాంపిటెంట్ అథారిటీ కథ:

   చాలా సిగ్గు చేటు విషయం ఏమిటంటే.... ఉద్యోగుపై కక్షసాధింపుతో ఇష్టారాజ్యంగా సస్పెన్షన్, సరెండర్, ఆర్థిక వేధింపులకు పాల్పడే సందర్భంలో విషయాన్ని బాధిత అధ్యాపకులు ఆర్జేడీ, కమీషనర్ ల దృష్టికి తీసుకు వెళితే ఆ ఆఫీసుల్లో పనిచేసే గుమాస్తాలు మొదలుకొని ఆర్జేడీ, కమీషనర్ లాంటి వారు కూడా సర్వాధికారాలు కాంపిటెంట్ అథారిటీ అయిన కరస్పాండెంట్ వే అని సిగ్గులేకుండా చెబుతూ యాజమాన్యం చర్యలను సమర్ధిస్తున్నారు. ఎ.పి. ఎడ్యుకేషన్ ఆక్ట్ 1982లోని సెక్షన్ 50, 72 వంటివి కాంపిటెంట్ అథారిటీ ఆర్జేడీ, కమీషనర్ అని చెబుతున్నా మేనేజర్ వ్యవహరించబడే కరస్పాండెంట్ వి అని చెబుతున్నారు. ఈ విషయాన్ని మీడియా ముందు చెప్పమంటే చెప్పలేరు. సిగ్గు చేటు విషయం ఏమిటంటే... కమీషనర్ లాంటి వారు చట్టాలు చదవకుండా క్రింది స్థాయి అధికారుల మాటల్ని గుడ్డిగా అనుసరిస్తున్నారు. యాజమాన్యాలు ఇన్నాళ్ళు ఇలా చెలరేగిపోయారు. నోటిఫ్ కేషన్ అనుమతి మొదలుకొని  అపాయింట్మెంట్, జీతభత్యాలు, ఇన్స్పెక్షన్, ఎంక్వైరీ సర్వాధికారాలు గల కమీషనర్, ఆర్జేడీ లు కాంపిటెంట్ అథారిటీ కాదట; వాళ్ళకు సస్పెండ్ చేసే అధికారం లేదటగాని..‌ రెండు నెలల తర్వాత సస్పెన్షన్ రివోక్ చేసే అధికారం మాత్రం వాళ్ళదేనట!ఇష్టానుసారంగా సరెండర్, సస్పెన్షన్లు చేసేందుకు మేనేజ్మెంట్ కు అధికారుల ప్రొసీడింగ్స్ అక్కరలేదటగానీ... ఆ పిరియడ్ కు సదరు ఉద్యోగికి ఇవ్వాల్సిన జీతభత్యాలకు అధికారుల ప్రొసీడింగ్స్ కావాలట!

(18) రెండు నాలుకలు

డిసిప్లీనరీ కంట్రోల్ రూల్స్ 1983, జి.ఒ. ఎం.ఎస్. నెం. 467 ప్రకారం జోనల్ స్థాయిలో కాంపిటెంట్ అథారిటీ ఆర్జేడీ అని స్పష్టంగా ఉన్నప్పటికీ, ఎవరు ఏ విషయాలలో ఎలా, ఎప్పుడు సస్పెండ్ చేయాలి, ఎలా ఎంక్వైరీ చేయాలి అని స్పష్టంగా ఉన్నప్పటికీ చట్టాలకు భిన్నంగా వ్యవహరించే యాజమాన్యాలను ఎంటర్టైన్ చేస్తున్నారు అధికారులు! సస్పెన్షన్, సరెండర్ పేరుతో ఉద్యోగుల్ని విధుల్లోకి రానివ్వకుండా సదరు ఉద్యోగులను ఊరికే కూర్చో బెట్టి జీతాలిస్తున్నారు. మేనేజ్మెంట్, కమీషనర్, ఆర్జేడీలు ప్రజాధనాన్ని ఇలా దుర్వినియోగం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన మేనేజ్మెంట్ లను అడ్డుకోకుండా ప్రోత్సహించిన ఆధికారునుండి ఈ డబ్బు వసూలు చేసి బాధిత ఉద్యోగులకు ఇవ్వాలి. ఇలా చేసినరోజు మరోసారి ఏ మేనేజ్మెంట్ ఇటువంటి చర్యలకు పూనుకోదు!. అధికారులు ఉపేక్షించరు!!

(19) అన్నీ ఉన్నా ఎయిడెడ్ ఉద్యోగులకు శని:

  కళాశాలల విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకుల కార్యాలయాల ఆర్జేడీ లు (office of the Regional Joint Director of Collegiate Education), కమీషనర్ ఆఫ్ కాలేజీయేట్ ఎడ్యుకేషన్ కు కమీషనర్ (CCE), ఏ.పి. హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ సెక్రెటరీ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కు ఛైర్మన్ (APSCHE), ఏ.పి. హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటర్ అండ్ మానిటరింగ్ కమిటీకీ ఛైర్ పర్సన్ (APHERML) వంటి వ్యవస్థలు....అందులో వివిధ స్థాయిల్లో అధికారులు ఉన్నప్పటికీ ఇన్నాళ్ళూ వీరందరు ఎయిడెడ్ కళాశాల యాజమాన్యాల ప్రయోజనాలగూర్చి మాత్రమే పనిచేశారు గాని కోర్టు మెట్లు ఎక్కాల్సిన పనిలేకుండానే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించిన సంస్థలు, అధికారులెవరూ లేనేలేరు!

(20) సార్థక నామధేయం నిరూపించుకుంటున్నాయి:

 ఏదో ఒక రేటుకి కమీషన్ కు కమీషనరేట్ లో పనులవుతాయి. కనుకనే కమీషనరేట్ అన్నారు. ఏ అక్రమం, అన్యాయం, అవకతవకలైనా మేనేజ్ చేసుకుని అన్నీ సక్రమం అని కాగితంపై రాయించుకునేదే మేనేజ్మెంట్. అందుకే వీరు సార్థక నామధేయులు!

(21) చాప చుట్టినట్టు విద్యా చట్టాలు :

చట్టాలకు విరుద్ధంగా వ్యవహరించిన ఎయిడెడ్ కళాశాలల యాజమాన్యాలపై ఎ.పి. ఎడ్యుకేషన్ ఆక్ట్ 1982లోని సెక్షన్ 24 ప్రకారం చర్యలు తీసుకుని ఎన్నిచోట్ల కమీషనర్ స్పెషల్ ఆఫీసర్ ను నియమించారు? ఇటువంటి అవసరం ఏర్పడకుండా   ఎయిడెడ్ వ్యవస్థలో ప్రతి కాలేజీ  చాలా పవిత్రంగా ఇన్నాళ్లు సాగాయి , సాగుతున్నాయి అని  మీడియా ముందుకు వచ్చి ఆర్జేడీ, కమీషనర్లు చెప్పగలరా?

(22) విద్యా సేవ ముసుగులో ఎయిడెడ్ వ్యవస్థ వ్యాపారం:

ఎ.పి. ఎడ్యుకేషన్ ఆక్ట్ 1982లోని సెక్షన్ 28 కి భిన్నంగా వ్యవహరించి కళాశాల ప్రాపర్టీస్ పై మార్టిగేజ్ క్రింద లోన్లు తీసుకున్న, భవనాలు-స్థలాలు అమ్ముకున్న, లీజుకిచ్చిన, బదలాయించిన ఎయిడెడ్ మెనేజ్మెంట్లపై ఇప్పటివరకు కమీషనర్, ప్రభుత్వం చర్యలు తీసుకున్నారు? మేము ఇటువంటి కళాశాలల లిస్ట్ కమీషనర్, ఆర్జేడీ లకు ఇస్తాం. చర్యలు తీసుకునే సత్తా అధికారులకుందా?

 [ఆ] పరిష్కార మార్గాలు:

(1) ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఖాళీలు ఉన్న చోట్ల ఎయిడెడ్ అధ్యాపకులను  భర్తీ చెయ్యవచ్చు.

(2) ప్రొఫెసర్ స్కేల్ అర్హత గల అధ్యాపకులను వివిధ విశ్వవిద్యాలయాలలో వినియోగించుకోవచ్చు.

(3) ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలు ఉపసంహరించుకున్న చోట్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్ని స్థాపించి పూర్తి స్థాయి అధ్యాపకులతో కళాశాలలను నిర్వహించవచ్చు.

(4) యూ.జి.సి. స్కేల్ సమాన స్థాయిగల పోస్ట్ లలో నియమించుకోవచ్చు.

 (5) అధ్యాపకేతర సిబ్బందిని కళాశాలల్లోనే గాక, వివిధ ప్రభుత్వ శాఖలల్లో వారి ఉద్యోగ హోదాను బట్టి వినియోంచుకోవచ్చు.

 () విద్యాచట్టాలు ఏం చెబుతున్నాయి?:

(1) గ్రాంట్ ఇన్ ఎయిడ్ ప్రభుత్వం విత్ డ్రా చేసుకోవడం గూర్చి ఎ.పి. ఎడ్యుకేషన్ ఆక్ట్ 1982లో సెక్షన్ 21(4) చెబుతోంది.

(2) ఎ.పి. ఎడ్యుకేషన్ ఆక్ట్ 1982లో సెక్షన్ 27 చాలా స్పష్టంగా చెబుతోంది మేనేజర్ అనబడే కరస్పాండెంట్, సెక్రెటరీ అనేవారు కళాశాల ప్రాపర్టీస్, రికార్డ్స్ కాంపిటెంట్ అథారిటీ అయిన కమీషనర్ కు అప్పజెప్పడం గూర్చి!

(3) ఎ.పి. ఎడ్యుకేషన్ ఆక్ట్ 1982లోని 10వ చాప్టర్ ని  53వ సెక్షన్ ఎయిడెడ్ విద్యా సంస్థల్లో ఆస్తుల బదలాయింపు నిషేధం గూర్చి హెచ్చరించింది. 

(4) ఎయిడెడ్ వ్యవస్థ లో ఇప్పుడున్న పరిస్థితులను చట్టాన్ని రూపొందించేటప్పుడే అంచనావేసి ఎ.పి. ఎడ్యుకేషన్ ఆక్ట్ 1982లోని 60వ సెక్షన్ లో మేనేజ్మెంట్ విద్యా సంస్థలను ప్రజా ప్రయోజనాల నిమిత్తం టేకోవర్ చేసుకునే హక్కు, అధికారాల గూర్చి చర్చించబడింది.

 ( ) ఆస్తులు ప్రభుత్వానివే: 

(1) లాభార్జన లేనిదే విద్యా సేవ. ప్రజా ప్రయోజనాలగూర్చి ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే హక్కు ఉందని ఆంధ్రప్రదేశ్ విద్యా చట్టం 1982లో చాలా స్పష్టంగా చెబుతోంది.  ఎందుకంటే ఎన్నో స్కీంల క్రింద కోట్లాది రూపాయల గ్రాంట్ లు పొంది వివిధ భవన నిర్మాణాలు చేసుకుని నిర్వహించబడుతున్నాయి ఎయిడెడ్ విద్యా సంస్థలు. 

(2) నేడు రాష్ట్రం ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఎయిడెడ్ కళాశాలల భవనాలు, స్థలాలు నూతన జిల్లాల  ఏర్పాటు అనంతరం ప్రభుత్వ కార్యాలయాలుగా, ప్రభుత్వ కళాశాలల ఏర్పాటుకు ఎంతగానో ఉపయోగపడతాయి..

() స్వార్థం వీడండి! : 

నిజానికి బదిలీల బెదురు లేకుండా పనిచేసే ఉరులోనే స్థిరనివాసం ఏర్పరచుకొని, పిల్లల్ని చదివించుకుంటూ, అపాయింట్ అయిన కాలేజీలోనే రిటైర్ అయ్యే సుఖం ఎయిడెడ్ వ్యవస్థ లో ఉంది. అనేక మంది దళిత అధ్యాపకులు ప్రభుత్వ నిర్ణయం  కష్టమైనా ప్రభుత్వ కళాశాలల్లో పనిచెయ్యడానికి ఇష్టపడుతున్నారంటే మేనేజ్మెంట్ కాలేజీలలో వారు ఎదుర్కొనే వేధింపులు, ఆత్మ గౌరవం లేకుండా తలవంచుకుపోతూ వారు, వారి విధుల్ని నిర్వర్తిస్తున్నారు అనేది ఇట్టే గ్రహించవచ్చు.

 

   సిటీల్లోని ఎయిడెడ్ కళాశాలల్లో పనిచేసేవారు హెచ్.ఆర్.ఎ. తగ్గిపోతుందని, మేనేజ్మెంట్ కు చెంచాగిరి చేస్తూ వాళ్ళ అడుగులడుగులొత్తేవారు , పాఠాలు చెప్పడం ఎగ్గొట్టే వాళ్ళు, ట్రాన్స్ఫర్ పేరుతో మూడేళ్లకోమారు ఊళ్ళుమారాల్సి ఉంటుంది అనే ఆలోచనలు ఉన్నవాళ్లు తప్పించి అధిక సంఖ్యాకులు ఈ ఎయిడెడ్ మేనేజ్మెంట్  చెరనుండి విముక్తి కావడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారని తెలిసింది! 

    ఒక్క సూటి ప్రశ్న: మేనేజ్మెంట్ కు భయపడకుండా మా ఎయిడెడ్ కాలేజీలో విద్యార్థులలో స్ఫూర్తి కలిగించడం కొరకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్  అంబేడ్కర్ జయంతిని ముందు రోజు క్లాస్ రూం తరగతుల్లోనో-కాలేజీలోనో మేము నిర్వహించగలుగుతున్నాం అనే ఒక్క అధ్యాపకుడున్నాడా? ఒక్క అధ్యాపక సంఘం ఉందా? పోనీ.... మేనేజ్మెంట్ గా మేమే అంబేడ్కర్ జయంతి కార్యక్రమంను, రాజ్యాంగ దినోత్సవం నిర్వహిస్తుంటాము అని చెప్పగలిగే మేనేజ్మెంట్ లు ఉన్నాయా ? డమ్మీగా ప్రిన్సిపాల్ స్థానాల్లో కూర్చోబడిన అరకొర దళిత ప్రిన్సిపాల్స్ లలో ఏ ఒక్కరైనా చెప్పగలరా? చెప్పలేరు.

    ప్రజాసంఘంగా, రిజర్వేషన్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ గా నేను ప్రభుత్వాన్ని కోరేది ఒక్కటే! ఎయిడెడ్ కాలేజీలను ప్రభుత్వ కళాశాలలుగా మార్చండి.  లేదా మొదట ఎయిడెడ్ సిబ్బందిని ప్రభుత్వం తీసుకుని చట్టాల్ని అనుసరించి ఎయిడెడ్ సంస్థ లను ప్రజా ప్రయోజనాల రీత్యా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఉపయోగించుకోవాలి.