Sunday, December 29, 2019
Saturday, December 28, 2019
Friday, December 27, 2019
2020 డాక్టా
డాక్టా స్థాపన ఆవశ్యకత :
వివిధ ఎయిడెడ్ కళాశాలలో పనిచేసే అధ్యాపకుల సమస్యలను పరిష్కరించుటకై దళిత విద్యావేత్తలు, దళిత ఉద్యమ నాయకులు, వైస్-ఛాన్సలర్, రిజిస్ట్రార్, ప్రిన్సిపాల్స్ సమక్షంలో 21 సెప్టెంబర్ 2014న పురుడుపోసుకున్న సంఘమే "ఎయిడెడ్ కళాశాలల దళిత అధ్యాపకుల సంఘం (డాక్టా).
ఎయిడెడ్ కళాశాలలలో పెరిగిన వివక్ష :
ఇటీవల కాలంలో దళిత అధ్యాపకులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలలో ఒక్కొక్కటి డాక్టా దృష్టికి వస్తున్నాయి. ఎయిడెడ్ కళాశాలలలో వివిధ సామాజిక వర్గాలకు చెందిన అధ్యాపకులు రిటైరయ్యాక బ్యాక్ లాగ్ పోస్టుల్లో నియమింపబడిన దళిత అధ్యాపకులే ఇప్పుడు 95 శాతం వరకు మిగిలి ఉన్నారు. లక్షల జీతంతో ఉద్యోగం చేసే దళిత అధ్యాపకుల పట్ల ఈర్ష్యాభావం యాజమాన్యాలలో మొదలైంది. కళాశాల యాజమాన్యం, ఆ యాజమాన్యం అండదండలతో అదే కులానికి చెందిన నాన్ టీచింగ్, పార్ట్ టైం అధ్యాపకులు దళిత అధ్యాపకులపై పెత్తనం చెలాయిస్తున్నారు.
నష్టపోతున్న దళిత అధ్యాపకులు:
ఉన్నత చదువులు చదువుతున్న దళిత అధ్యాపకులు వివక్ష కారణంగా ఎంతగానో నష్టపోతున్నారు. విశ్వవిద్యాలయాలలోని నియామకాలకు అప్లై చేసుకోవడానికి యాజమాన్యం నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వకుండా వేధించడం చేస్తున్నారు. ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం ( ఒకప్పుడు ఎఫ్.ఐ.పి.అనేవారు)ద్వారా పిహెచ్.డి. చెయ్యనివ్వకపోవడం, మైనర్-మేజర్ ప్రాజెక్ట్ వర్క్ లు చేయడానికి అవకాశం కల్పించే పోవడం, సెమినార్స్ కు పంపించకపోవడం, సెమినార్స్ నిర్వహించడానికి అనుమతించక పోవడం... ఇలా ఎన్నో విషయాలలో దళిత అధ్యాపకులను యాజమాన్యాలు ఉద్దేశ్యపూర్వకంగా నష్టపరుస్తున్నాయి. కనుక ఇటువంటి యాజమాన్యాలపై చర్యలు తీసుకోమని అధికారులను డాక్టా కోరుతోంది.
అడ్డగోలుగా నియామకాలు:
న్యాయబద్ధంగా ఎయిడెడ్ అధ్యాపకులు నిర్వహించాల్సిన ఎన్.సి.సి., హాస్టల్ వార్డెన్, ఎన్.ఎస్.ఎస్., డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కో-ఆర్డినేటర్... మొదలగున్నవెన్నో ఎయిడెడ్ కళాశాలలో పార్ట్ టైం అధ్యాపకులు నిర్వహిస్తున్నారు. ఇంకెంత దారుణం అంటే పేపర్ వ్యాల్యువేషన్ లో పార్ట్ టైం అధ్యాపకుడు సి.ఎస్.గా ఉండగా ఎయిడెడ్ అధ్యాపకుడు సి.ఇ.గా చేయాల్సిన పరిస్థితి. ఇంకొన్ని కళాశాలలలో పార్ట్ టైం అధ్యాపకులు శాఖాధిపతులుగా ఉండగా వారి క్రింద ఎయిడెడ్ అధ్యాపకులు పనిచేయాల్సిన దుస్థితి.
నాక్ కమిటీలలో పార్ట్ టైం అధ్యాపకులదే హవా. ఆర్థిక అవకతవకలు పొక్కకుండా ఉండడానికి యూజీసీ ఫండ్స్ కమిటీలలో పార్ట్ టైం అధ్యాపకులను యాజమాన్యాలు నియమించుకుంటున్నాయి. అంతేకాదు; దశాబ్దాలుగా ప్రిన్సిపాల్ నియామకాలలో యాజమాన్యాలు సీనియారిటీని అనుసరించకుండా తమ కులానికి చెందిన వారిని, అలువంటివారు లేకుంటే తమకు అనుకూలంగా పని చేస్తాడనుకునే వారిని ప్రిన్సిపాల్ సీట్లు కూర్చో పెడుతున్నారు. సూపరింటెండెంట్, ప్రిన్సిపాల్, యాజమాన్యం ఒక్కటై ఆర్థిక అవకతవకలకు పాల్పడుతున్నారు. రోస్టర్ సిస్టం అనుసరించి ఇంకా భర్తీ చేయాల్సి ఉన్న టీచింగ్, నాన్-టీచింగ్ బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయకుండా యాజమాన్యాలు వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. వీటన్నింటి సమస్యల పరిష్కారం కోసమే డాక్టా కృషి చేస్తోంది.
రూల్స్ ను అనుసరించమనే వారికి శిక్ష:
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే యాజమాన్యాన్ని వివిధ సందర్భాలలో పరిశీలించుకోమని సూచించే దళిత అధ్యాపకుల గొంతు నొక్కెయ్యాలని నిరాధారమైన ఆరోపణలతో మెమోలు, షోకాజ్ నోటీసులు, సస్పెన్షన్, సరెండర్ లు చేస్తున్నారు. దళిత అధ్యాపకుల వ్యక్తిగత విషయాలను అందరిలో ప్రస్తావిస్తూ అవమానపరచే ప్రయత్నానికి సైతం యాజమాన్యాలు వెనుకాడడం లేదు. అధ్యాపకుల ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారు. అంతే కాదు; ఇలా ప్రశ్నించే వారిని బెదిరించి వారి తప్పులను కప్పి పుచ్చుకోవటం కోసం నిస్సిగ్గుగా ఉమెన్ హరాస్మెంట్ వంటి తప్పుడు కేసులు వారిపై బనాయించడానికి కూడా యాజమాన్యాలు దిగజారి పోతున్నారు. చాగలమర్రిలో అనంతమూర్తి అనే ఆంగ్ల అధ్యాపకునిగా చావుకు యాజమాన్యం వేధింపులే ప్రధానకారణం!
దళిత అధ్యాపకులను లక్ష్యంగా చేసుకుని యాజమాన్యం ఇబ్బంది పెడుతున్న ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా మెమోలు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నారు. వీటన్నింటికీ ఉదాహరణగా విశాఖ జిల్లాలోని ఒక ఎయిడెడ్ కళాశాల ప్రథమ స్థానంలో నిలిచింది. ఇటువంటి సమస్యలను సంబంధిత మంత్రి, కమీషనర్ గార్ల దృష్టికి తీసుకువెళ్లి ఎంక్వయిరీ నిర్వహించమని కోరి సమస్యల పరిష్కార దిశగా డాక్టా పనిచేస్తోంది. ఇటువంటి వాటికి పాల్పడిన యాజమాన్యాన్ని తొలగించి స్పెషల్ ఆఫీసర్(ఎస్. ఒ.) ను నియమించాలని డిమాండ్ చేస్తోంది. ఎయిడెడ్ కళాశాలలలో ఏ ఆర్థిక అవకతవకలు జరిగినా, నిబంధనల ఉల్లంఘన జరిగినా సూపరిండెంట్స్, ప్రిన్సిపాల్స్ పాత్ర ఉంటుంది కనుక వీరిపై కూడా చర్యలు తీసుకుంటేనే సమస్యలు పునరావృతం కావని అధికారులు గుర్తించి అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలి.
స్థానిక దళిత సంఘాలతో మమేకమవుతూ...:స్థానిక దళిత సంఘాలతో మమేకమవుతూ...:
డాక్టా స్థానిక దళిత సంఘాలతో, నాయకులతో మమేకమవుతూ వారు ఎదుర్కొనే అనేక సమస్యలను వారి దృష్టికి తీసుకు పోవడం చేస్తోంది. దళిత మేథావులు, నాయకులు డాక్టా గొంతుకై సమస్యల పరిష్కారానికి డాక్టాకు మద్దతుగా నిలుస్తున్నారు.
డాక్టా- ప్రజా ప్రతినిధుల స్పందన:
డాక్టా వివిధ కళాశాలలో జరుగుతున్న వాస్తవిక విషయాలను ఆధారాలతో అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకు వెళుతుంది. ఈ అంశాలన బట్టి అధికారులు, ప్రజాప్రతినిధులు డాక్టా అందించే వినతి పత్రాలకు స్పందించి సమస్యల పరిష్కారానికి ఆదేశిస్తున్నారు. ఈసందర్భంగా వీరందరికీ డాక్టా కార్యవర్గం, సభ్యులు కృతజ్ఞతలు.
ఎయిడెడ్ కళాశాలలను ప్రభుత్వ కళాశాలలు గా మార్చాలి:
ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశ పెట్టడంలో మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పలు సమావేశాలలో డాక్టా తన హర్షాన్ని వ్యక్తం చేసింది. అంతే కాదు; ఎయిడెడ్ కళాశాలలను ప్రభుత్వ కళాశాలలు మార్చేందుకు యాజమాన్యాల సుముఖత/విముఖతను తెలియజేయమంటూ ప్రభుత్వం ఇటీవల ఒక సర్క్యులర్ ను పంపింది. కోట్లాది రూపాయలు ప్రభుత్వం జీతాల రూపంలో ఉద్యోగులకు చెల్లిస్తోంది. కోట్లాది రూపాయలు యూ.జి.సి. గ్రాంట్స్ రూపాలలో కళాశాల అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తోంది. కళాశాల అభివృద్ధికి వివిధ దాతలు ఇచ్చిన భూమి, చేసిన ఆర్థిక సహాయాలు అన్ని కళాశాలలకు చెందినవి కావు అనేది ఎయిడెడ్ కళాశాలల యాజమాన్యం వారు గ్రహించాలి. సేవాభావం విస్మరించిన యాజమాన్యాలు కళాశాలపై తమ పెత్తనాన్ని వదులుకోడానికి ఇష్టపడక కళాశాలను తమ సొంత ఆస్తిగా భావిస్తూ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ ఆలోచనతోనే గతంలో కొన్ని కళాశాలలు ఎయిడెడ్ అధ్యాపకులను ప్రభుత్వానికి అప్పజెప్పి కళాశాలల నిర్వహణ, భవనాలు, స్థలంపై ప్రభుత్వ పెత్తనం లేకుండా పూర్తి ప్రైవేట్ కళాశాలగా అనిపించుకుని కళాశాల ఆస్తులను తమ స్వంతం చేసుకోవాలనే ప్రయత్నాలు చేశాయి. కొన్ని కళాశాలలో కళాశాలకు చెందిన భూములలోని కొంత భాగాన్ని అమ్ముకున్న యాజమాన్యాలు లేకపోలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇవి గ్రహించి నిర్భందంగా ఎయిడెడ్ కళాశాలలను ప్రభుత్వ కళాశాలుగా మార్చాలి. ఇలా చేయలేని పక్షంలో మొదటిగా ఉద్యోగులను ప్రభుత్వ కళాశాలలో కి బదిలీ చేయాలి. ఆతర్వాత కళాశాల ఆస్తులను ప్రజోపయోగకరమైనవాటికి ప్రభుత్వం వినియోగించుకునేలా సమర్థవంతమైన నిర్ణయం తీసుకోవాలని డాక్టా కోరుతుంది.
Subscribe to:
Comments (Atom)

















































